ఉద్యమం నెలబాలుడు (కవిత)

శివసాగర్ 1969లో కొండపల్లి సీతారామయ్య గారితో కలిసి CPI(ML) పార్టీలో చేరారు. వీరిద్దరు ఒకప్పుడు టీచర్లు. వీరు ఉద్యోగాలని, భార్యాపిల్లలని వదిలి కార్మిక వర్గ విప్లవ పార్టీలో చేరారు. శివసాగర్ పార్టీలో పని చేస్తూ కవితలు వ్రాసేవారు. ఉద్యమ జీవితంలో తనకి ఎదురైన అనుభవాలు గురించి కూడా కవితలు వ్రాసేవారు. శివసాగర్ కవితా సంపుటులలో మొదటి సంపుటి 1972లో ప్రచురితమయ్యింది. ఆ సంపుటి పేరు "గెరిల్లా విప్లవ గీతాలు". 1970లలో అనేక మంది మేధావులు కార్మిక విప్లవోద్యమంలో చేరారు. వీళ్ళు అయిదేళ్ళలోనే విప్లవం వస్తుందనుకున్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ వల్ల విప్లవోద్యమం తీవ్ర అణచివేతకి గురయ్యింది. అప్పట్లో చేరిన మేధావులలో చాలా మంది విప్లవం పట్ల నిరాసక్తికి లేదా వ్యక్తిగత అవకాశవాదానికి పోయి ఉద్యమం నుంచి బయటకి వచ్చేశారు. శివసాగర్ వంటి కొద్ది మంది మాత్రం పార్టీలో కొనసాగారు. 1971లో శ్రీకాకుళం జిల్లాకి చెందిన చౌదరి తేజేశ్వరరావు, మరి కొందరు విప్లవకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వరరావు, అతని అనుచరులు అరెస్ట్ అయిన తరువాత ప్రభుత్వానికి క్షమాభిక్ష అడగడానికి పార్టీకే వెన్నుపోటు పొడిచారు. సాయుధ పోరాటం మొదలు పెట్టడం తప్పైపోయిందంటూ ప్రకటనలు గుప్పించారు. వీళ్ళని విమర్శిస్తూ శివసాగర్ "ఉద్యమం నెలబాలుడు" అనే కవిత వ్రాసారు.

రెనెగేడ్!
ప్రయాణం పదివేల మైళ్ళని
ముందే అనుకున్నాం అవునా?
పది అడుగులు వేశామో లేదో
అపుడే ఎందుకింత ఆయాసం?

తేజేశ్వరరావు అనుచర గణం యొక్క మానసిక డొల్లతనాన్ని ఎత్తి పొడిచిన వచనాలలో ఇవి కొన్ని.

ఈ నావ చేరవలసింది
సుదూర తీరమని
మార్గ మధ్యంలో
పెను తుఫానులు, సుడి గుండాలు
తప్పవని
ముందే అనుకున్నాం అవునా?
నిన్న లంగరు ఎత్తామో లేదో
అపుడే ఇంత కంగారు

పూర్వం ఒక గ్రీక్ వీరుడు గ్రీస్ నుంచి ఇండియాకి గుర్రం మీద బయలుదేరాడు. దారిలో మెసొపొటేమియా అడవులలో కొండ చిలువలు ఉంటాయని విని వెనుతిరిగాడు. రెనెగేడ్స్ (వర్గ ద్రోహులు) కూడా అలాంటివాళ్ళే. శివసాగర్ ఎనిమిది పేజిలలో ఈ కవిత వ్రాశారు. నిన్న విప్లవ వీరులలా కనిపించిన వాళ్ళు నేడు విప్లవ ద్రోహులు ఎందుకవుతారో, ఎలా అవుతారో ఆ కవితలో వ్రాసారు.

0 comments:

Post a Comment

వ్యాఖ్యలు తెలుగులో టైప్ చెయ్యడానికి లేఖిని లేదా ఫైర్ ఫాక్స్ ఇండిక్ ఇంపుట్ ఎక్స్టెన్షన్ వాడండి.